కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి : హరీశ్రావు

కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి : హరీశ్రావు
  • మాజీ మంత్రి, బీఆర్ఎస్​ నేత ​హరీశ్​రావు డిమాండ్​
  •     ఎల్​నినోపైకి నెట్టేసి చేతులు దులుపుకుంటరా?
  •     శ్రీశైలంలో 84 టీఎంసీల వినియోగం పచ్చి అబద్ధం
  •     మనకున్నది పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్టులే
  •     పంటలు కాపాడే సోయి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శ

హైదరాబాద్, వెలుగు: ఎల్​నినో వల్ల కరువు వచ్చిందంటూ ప్రభుత్వం చేతులెత్తేయడం దారుణమని మాజీ మంత్రి, బీఆర్ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్​రావు విమర్శించారు. సాగునీరు, విద్యుత్​ కష్టాలపై అసెంబ్లీలో చర్చ జరిగిన తీరు చూస్తుంటే.. ఇది కాలం తెచ్చిన కరువుకాదు..కాంగ్రెస్​, రేవంత్​ తెచ్చిన కరువు అని అర్థమవుతున్నదన్నారు. నీళ్లు, కరెంటు విషయాల్లోనూ ప్రభుత్వ తప్పిదాలను ఎల్‌నినో పై నెట్టేసి బాధ్యతారహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఈ ఏడాది తెలంగాణ 84 టీఎంసీలు వాడుకుందని మంత్రి ఉత్తమ్​ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 84 టీఎంసీలు వాడితే ఆ నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఏ రిజర్వాయర్ నింపారు? ఏ పొలాలకు నీరు ఇచ్చారని నిలదీశారు. శ్రీశైలం మీద మనకున్నది కల్వకుర్తి, పాలమూరు ఎత్తిపోతల పథకాలు మాత్రమేనని పేర్కొన్నారు. పాలమూరు -రంగారెడ్డిని పండబెట్టారని, కల్వకుర్తిలో ఇప్పటివరకు ఎత్తింది 8 టీఎంసీలేనని ఆరోపించారు.

మరి, 84 టీఎంసీలు ఎలా వాడారని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్‌లో గతంలో ఎన్నడూలేని విధంగా 2024–25లో 286 టీఎంసీల నీటిని వాడామని ఉత్తమ్​ చెప్పారని, కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ అఫీషియల్ రికార్డుల ప్రకారం.. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వినియోగంలో అత్యంత చెత్త రికార్డ్ ఈ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలోనే నమోదైందని ఫైర్​ అయ్యారు. నదిలో నీళ్లు వచ్చినప్పుడు 2014 నుంచి 2017 వరకు బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ 31%, 35.8%, 45% దాకా నీటిని వాడుకుంటే.. 2024-–25లో ఏపీ 71.5% వాడుకుందన్నారు. తెలంగాణ వాడింది కేవలం 28.4 శాతమని చెప్పుకొచ్చారు.

ఇక 2025–26లో అయితే మరీ ఘోరంగా కేవలం 25% మాత్రమే వాడుకున్నారని ఆరోపించారు. ఈ కరువు కాలంలో ఈ ఏడాది ఏపీ 83 టీఎంసీలు వాడుకుంటే, హైదరాబాద్ తాగునీటితో కలిపి తెలంగాణ వాడింది కేవలం 43 టీఎంసీలేనని, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా..? అని ప్రశ్నించారు. 

కర్నాటక నుంచి నీళ్లు తెప్పించే తెలివి లేదు..

కరెంట్ లేక మోటార్లు నడపక, కేసీఆర్ సృష్టించిన 3.16 లక్షల ఎకరాల ఆయకట్టును ప్రభుత్వం ఆగం చేస్తున్నదని హరీశ్​రావు మండిపడ్డారు. నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల కింద దాదాపు 3 లక్షల ఎకరాల పంట ఎండిపోయే ప్రమాదకర స్థితిలో ఉందన్నారు. కనీసం కర్నాటకలోని వాళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగి ఆల్మట్టి నుంచి ఒక నెల రోజులు నీళ్లు తెప్పించి పంటలు కాపాడే సోయి కూడా ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కాళేశ్వరం బ్యారేజీలకు ఏం కాలేదని, మేడిగడ్డలో ఒక్క ఏడో బ్లాక్​ తప్ప.. మిగతా బ్లాకులన్నీ సేఫ్​ అని సీడబ్ల్యూపీఆర్ఎస్​చెప్పిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్ట్​ చేసుకోవచ్చంటూ ఎన్​డీఎస్ఏ హైకోర్టులో అఫిడవిట్​వేసినప్పటికీ ఎందుకు మోటార్లు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మేడిగడ్డ వద్ద రోజూ 4 టీఎంసీల జలాలు వృథాగా పోతున్నాయని వెల్లడించారు. కాగా, ఎల్లంపల్లికి ఈసారి 37 టీఎంసీల ఫ్లడ్ వస్తే.. కేవలం 6 టీఎంసీలు మాత్రమే ఎత్తి, మిగిలిన నీళ్లన్నీ కిందకు వదిలేశారని మండిపడ్డారు. 

కరెంట్ ​ఏదీ..?

రాష్ట్రాన్ని మళ్లీ కరెంట్​ కష్టాల్లో ముంచారని హరీశ్ రావు విమర్శించారు. రైతులు డీజిల్ జనరేటర్లు పెట్టుకుని రోజుకు రూ.1500 ఖర్చు చేస్తూ పంటలు కాపాడుకునే దుస్థితి తెచ్చారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లెక్కల ప్రకారమే.. 4 వేల మెగావాట్లు ఉత్పత్తి కావాల్సిన యాదాద్రి పవర్ ప్లాంట్ లో బొగ్గు లేక కేవలం 1500 మెగావాట్లే ఉత్పత్తి చేస్తున్నారన్నారు.